Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

రామకోటి -కామకోటి

శ్రీ స్వామివారు ''రామకోటి'' , ''కామకోటి'' పదముల మీమాంస చేస్తూ, లోగడ జరిగిన ఒక ఉదంతాన్ని క్రింది విధంగా వివరించారు.

దాదాపు 30 సంవత్సారల క్రిందట మేము కాశీయాత్ర సల్పిన సందర్భంలో తాతానగర్‌లో కొన్నాళ్ళు మకాంచేశాం. అప్పు డక్కడ ధనుర్మాససభలు జరుగుతున్నాయి. బీహార్‌ పత్రికలు మేము అక్కడ ఉన్న విషయాన్ని ప్రకటిస్తూ ''కంచికామకోటిపీఠాధిపతులు'' అనడానికి మారు ''రాంచీరామకోటి పీఠాధిపతులు'' అన్నాయి! ఇంగ్లీషు భాషలో 'క్‌' ఆర్‌, అనే అక్షరానికీ 'ఆర్‌' అనే అక్షరానికి రూపసామ్యం ఉండడం వల్లను, ''కంచికామకోటి'' పదముల అర్థం తెలియనందువల్లను వారు ఆవిధంగా ప్రచురించి ఉంటారు. కాని, యిది చాలా చమత్కారంగా వుంది. రాముడు విష్ణువు, కాముడు విష్ణుని పుత్రుడు, కాని రాముడున్న చోట మాత్రం కాముడు వుండడు, తొలగిపోతాడు. తులసీదాసుకూడా 'రామచరితమానస్‌'లో ''జహారామ్‌ హో వహా-కామ్‌ నహీ''అన్నారు. అయితే ''రాముడు, కాముడు,'' విషయం యిలా వున్నా ''రామకోటి'' ''కామకోటి'' అనే టప్పటికి- ''కోటి'' అనే పదంచేరే సరికి సందర్భమూ, అర్థమూకూడా మారిపోతుంది. ''సో శ్ను తే సర్వాన్‌ కామాన్‌ సహా''-న్నట్టు మోక్షపర్యంతమూ సర్వకాముమలను నెరవేర్చునది కామకోటి, రాముడన్నచోట కాముడు కనబడడు, గాని కామకోటి వున్నచోట రామకోటి వుండడానికి అభ్యంతరం లేదు. అందువల్ల కామకోటిపీఠం రామకోటిపీఠం కావడం మాకు సంతోషమే? మరి రామకోటిపీఠం ఎవరిస్తారు? రామేశ్వరంలో మేము శంకరప్రతిష్ఠ చేశాం. కనుక రామకోటి మాకు చాలా ప్రీతికరమైనది. అట్టి రామకోటి పుస్తకములను చలవచప్రంలో ఊరేగింపుగా తీసికొని వచ్చి బందరు పౌరులు మాకు స్వాగతం చెప్పారు. దూరంనుంచి చూచి అదేదో దేవుడి ఊరేగింపేమో అనుకొన్నాం. అవి రామకోటి పుస్తకాలు అని తెలుసుకొన్నప్పుడు మా ఆనందం మిన్నుముట్టింది. చిరకాలంగా వున్న మాఆశ ఫలించింది. రామకోటి మాకు లభించింది. సాక్షాత్తు శ్రీరాముడే యెదురొచ్చి బందరుకు మమ్మల్ని ఆహ్వానించినంత పరమానంద మయింది.

''కలియుగంలో కూడ- భగవద్భక్తి ఉన్నచోట వేదం వున్నచోట కలి దూరంగా పోతాడు. అటువంటి సాంగోపాంగ వేదపురుష సాన్నిధ్యము ఆంధ్రభూమిలో వున్నది. ఆ సంప్రదాయాను సారమే యిక్కడ సాంగవేద పాఠశాల నెలకొల్పబడి మంచి కృషి చేస్తున్నది. ఇట్టి కృషి భారత దేశానికే మార్గదర్శకం.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page